Monday, April 21, 2014

చరవాణి చేతికి అందిన రోజు...

అంటే అదేదో మొదటిసారి కాదండోయ్... కొత్త ఫోను వచ్చిన రోజన్నమాట!

మనిషికి అత్యవసర వస్తువుగా మారిన సెల్లు నాకు తోడయ్యి ప్రస్తుతానికి 7 ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు వాడిన వాటికి ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ఈ సెల్లు నేస్తానికి తేడా ఉంది. అదేంటి అంటే? ఈ ఫోను పంపింది నా ప్రియ మిత్రురాలు...అందుకే అంత ప్రత్యేకం!
ఇది నా చేతికి వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పసిపిల్లలా చూసుకుంటున్నా.   అయినా ఏం చేద్దాం  మొన్న ఛార్జింగ్ పెట్టినపుడు ఠక్కున కింద పడింది. నా మనస్సు చివుక్కుమంది. పోనీలే అని మనసుకు సర్ది చెప్పుకున్నా. 

ఈ విషయాన్ని నా స్నేహితురాలితో చెబితే ఏమందో తెలుసా?
‘‘ ఏం కాదులే ఫోను పడితేనే ఎందుకంత బాధపడతావ్? ’’ అంటూ నన్ను బుజ్జగించింది... దాంతో నా చింత  ఎగిరిపోయింది...



-  నవనీత

Sunday, February 23, 2014

(వ్యక్తి‘గతం’) నా అల్లరి గుర్తులు...

                         

బడంటే చాలా ఇష్టం.  ఎక్కువ సమయం అక్కడే గడిపేదాన్ని. ఓసారి మా స్కూలు  విహార యాత్రకు వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు.  వాళ్ల హడావిడి చూస్తే నాకూ వెళ్లాలనిపించింది. కానీ ఏం చేస్తాం...
నాకా అవకాశం లేదు. ఎందుకంటే నేను అప్పుడు  ఐదో తరగతి...
ఏడో తరగతి నుంచి 10వరకు చదివే విద్యార్థుల్ని మాత్రమే తీసుకెళ్తున్నారు...
అయినా సరే... ఎలాగైనా వెళ్లాలనుకున్నా...
అమ్మకు చెప్పి రెండు రోజులు అలిగి కూర్చున్న...
అమ్మ ఎంతగా చెప్పినా వినలేదు...
చివరకు మా టీచర్ దగ్గరికొచ్చి రిక్సెస్టు చేసింది..  సరేనంటూ టీచర్లు కూడా ఒప్పుకున్నారు..
దాంతో నాకు సంతోషం పట్టలేదు.. హాయిగా వెళ్లొచ్చా...
అప్పుడ నేను పొందిన ఆనందం అంతా ఇంతా కదూ...
మాటల్లో చెప్పలేను... చేతల్లో చూపలేను...

Sunday, February 9, 2014

నాకు నచ్చిన పుస్తకం....అంధకారంలో


  •  రంగనాయకమ్మ రాసిన అద్భుతమైన నవల ఇది.
ఈ నవలలోని ‘రాజేశ్వరి’ని నేను బయట కూడా చూశాను. కానీ అప్పుడామె భావాలు నాకు తెలియదు. ఆమె నా  దారిదాపుల్లో కనిపిస్తే చీదరించుకుని గబగబా ముందుకు వెళ్లేదాన్ని. ఆమె గురించి తప్పుగా మాట్లాడుతూ హేళన చేసేదాన్ని.

కానీ నాలో మార్పు వచ్చింది. కొంతలో కొంతైనా ఆమెను అర్థం చేసుకునే పరిస్థితి  ఏర్పడింది. కారణం ఓ పుస్తకం. అదే రంగనాయకమ్మ రాసిన ‘అంధకారంలో’...

ఇందులో ఆడదాని నిస్సహాయాన్నీ, పురుషుడి అధిక్యాన్నీ, వ్యక్తుల ఆలోచనతీరు చక్కగా చూపించారు. ప్రతీ పాత్రకు ఒక ప్రత్యేకతనిస్తూ చదివించేలా రాశారు.

ఒక్క అనుమానంతోనే జీవితం చిన్నాభిన్నమైన తీరు...

సమాజానికి భయపడి బిడ్డను వదిలేసుకున్న రాధ తండ్రి...
ఇలా ఎన్నో కోణాలు... కనిపిస్తుంటాయి.

రాముడు, రాధ, లలిత,  పద్మ, రాజేశ్వరి పాత్రలు నాకెంతో నచ్చాయి. వివేకం ఉన్నా మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ఉండటం ఆదర్శనీయంగా అనిపిస్తుంది.
ఆడవాళ్ల స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రతీ సన్నివేశం కల్పించి రాసినట్టుగా కాకుండా నిజ జీవితంలో ఉన్నట్టుగానే ఉంది.

బజారు మనిషి వెనుకున్న భయంకరమైన విషాదం ఉందనే విషయం తెలుపుతూ ముందుకు సాగుతుంది ఈ నవల.

పతివ్రత అంటే అర్థం మగాడి మాట జవదాటకపోవడమని ఒక పురాణచరిత్ర చెబితే, శీలమే పాతివ్రత్యం అని మరోటి చెబుతుంది అంటూ వేదాలు, ఇతిహాసాల ఉదాహరణలతో చెప్పారు.
అప్పటి వరకు సరదాగా సాగుతున్న శేఖర్, లలితల జీవితం ఒక్క సంఘటనతో పూర్తిగా మారిపోవడం చూస్తే ఎంత చిత్రంగా అనిపిస్తుందో...

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ...
ఈ నవలలోని ప్రతీ పాత్ర, ప్రతీ సన్నివేశం నన్ను ఎంతగానో కదిలించాయి. కన్నీరు పెట్టించాయి.

ఇప్పుడు నేను రాజేశ్వరిని చూసినా చీదరించుకోను... దూరంగా వెళ్లను.
వీలైతే అర్థం చేసుకుంటా...

- జి.నవనీత