Sunday, February 9, 2014

నాకు నచ్చిన పుస్తకం....అంధకారంలో


  •  రంగనాయకమ్మ రాసిన అద్భుతమైన నవల ఇది.
ఈ నవలలోని ‘రాజేశ్వరి’ని నేను బయట కూడా చూశాను. కానీ అప్పుడామె భావాలు నాకు తెలియదు. ఆమె నా  దారిదాపుల్లో కనిపిస్తే చీదరించుకుని గబగబా ముందుకు వెళ్లేదాన్ని. ఆమె గురించి తప్పుగా మాట్లాడుతూ హేళన చేసేదాన్ని.

కానీ నాలో మార్పు వచ్చింది. కొంతలో కొంతైనా ఆమెను అర్థం చేసుకునే పరిస్థితి  ఏర్పడింది. కారణం ఓ పుస్తకం. అదే రంగనాయకమ్మ రాసిన ‘అంధకారంలో’...

ఇందులో ఆడదాని నిస్సహాయాన్నీ, పురుషుడి అధిక్యాన్నీ, వ్యక్తుల ఆలోచనతీరు చక్కగా చూపించారు. ప్రతీ పాత్రకు ఒక ప్రత్యేకతనిస్తూ చదివించేలా రాశారు.

ఒక్క అనుమానంతోనే జీవితం చిన్నాభిన్నమైన తీరు...

సమాజానికి భయపడి బిడ్డను వదిలేసుకున్న రాధ తండ్రి...
ఇలా ఎన్నో కోణాలు... కనిపిస్తుంటాయి.

రాముడు, రాధ, లలిత,  పద్మ, రాజేశ్వరి పాత్రలు నాకెంతో నచ్చాయి. వివేకం ఉన్నా మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ఉండటం ఆదర్శనీయంగా అనిపిస్తుంది.
ఆడవాళ్ల స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రతీ సన్నివేశం కల్పించి రాసినట్టుగా కాకుండా నిజ జీవితంలో ఉన్నట్టుగానే ఉంది.

బజారు మనిషి వెనుకున్న భయంకరమైన విషాదం ఉందనే విషయం తెలుపుతూ ముందుకు సాగుతుంది ఈ నవల.

పతివ్రత అంటే అర్థం మగాడి మాట జవదాటకపోవడమని ఒక పురాణచరిత్ర చెబితే, శీలమే పాతివ్రత్యం అని మరోటి చెబుతుంది అంటూ వేదాలు, ఇతిహాసాల ఉదాహరణలతో చెప్పారు.
అప్పటి వరకు సరదాగా సాగుతున్న శేఖర్, లలితల జీవితం ఒక్క సంఘటనతో పూర్తిగా మారిపోవడం చూస్తే ఎంత చిత్రంగా అనిపిస్తుందో...

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ...
ఈ నవలలోని ప్రతీ పాత్ర, ప్రతీ సన్నివేశం నన్ను ఎంతగానో కదిలించాయి. కన్నీరు పెట్టించాయి.

ఇప్పుడు నేను రాజేశ్వరిని చూసినా చీదరించుకోను... దూరంగా వెళ్లను.
వీలైతే అర్థం చేసుకుంటా...

- జి.నవనీత

No comments:

Post a Comment